Amrit Bharat: త్వరలో మరో రెండు అమృత్ భారత్ రైళ్లు.. రైల్వే ప్రయాణికులకు సూపర్ న్యూస్
రైల్వే ప్రయాణికులకు శుభవార్త. భారతీయ రైల్వే తాజాగా అమృత్ భారత్ రైళ్లపై కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే దేశ నలుమూలల నాన్-ఏసీ కోచ్లతో ప్రజలకు అందుబాటులో ఉన్న ఈ రైళ్ల తదుపరి వెర్షన్ అమృత్ భారత్ 3.0 రాకపై స్పష్టత వచ్చింది. ఇటీవల ప్రారంభించిన తొమ్మిది కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పాటు, త్వరలో మరో రెండు అత్యాధునిక రైళ్లు అందుబాటులోకి రానున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
అమృత్ భారత్ 3.0 ప్రత్యేకత ఏంటి
అమృత్ భారత్ 1.0 మరియు 2.0 పూర్తిగా నాన్-ఏసీ కోచ్లతో ప్రారంభమయ్యాయి. సామాన్య ప్రజానీకాన్ని దృష్టిలో పెట్టుకొని వాటిని రూపొందించారు. అయితే ఇప్పుడు వస్తున్న అమృత్ భారత్ 3.0 వెర్షన్ రైళ్లు మరింత ప్రత్యేకం. ఇందులో ఏసీ, నాన్-ఏసీ కోచ్లు రెండూ ఉండనున్నాయి. సాధారణ ఎక్స్‌ప్రెస్ రైళ్ల మాదిరిగా ఈ రైళ్లు స్లీపర్, జనరల్, ఏసీ కోచ్ల కలయికతో నడవనున్నాయి. ఇవి గంటకు 130 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లేలా డిజైన్ చేస్తున్నారు.
అమృత్ భారత్ 3.0 ఫీచర్లు
- మిక్స్డ్ కోచ్ కాన్ఫిగరేషన్: ఏసీ, స్లీపర్, జనరల్ కోచ్లు అన్నీ ఒకే రైలులో ఉండనున్నాయి.
- అధిక వేగం: గంటకు 130 కి.మీ వేగంతో ప్రయాణించే సామర్థ్యం.
- పుష్-పుల్ టెక్నాలజీ: రెండు చివర్లా లోకోమోటివ్లు ఉండటంతో వేగవంతమైన యాక్సిలరేషన్, డీయాక్సిలరేషన్ ఉంటాయి.
- మెరుగైన సీట్లు, బెర్త్లు: ప్రయాణికుల సౌకర్యం కోసం కొత్త డిజైన్ లో సీట్లు, బెర్త్లు రూపొందిస్తున్నారు.
- భద్రతకు ప్రాధాన్యం: ప్రతి కోచ్‌లో సీసీటీవీ కెమెరాలు, అత్యవసర టాక్-బ్యాక్ సిస్టమ్ ఉంటాయి.
- ఆధునిక సౌకర్యాలు: ప్రతి బెర్త్ దగ్గర మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు, ఎల్ఈడీ లైటింగ్, ఫోల్డబుల్ స్నాక్ టేబుల్స్ ఉంటాయి.
- పరిశుభ్రతకు ప్రత్యేక శ్రద్ధ: మాడ్యులర్ టాయిలెట్లు, మెరుగైన నిర్వహణ వ్యవస్థ ఉంటుంది.
ఇప్పటికే ప్రారంభమైన తొమ్మిది కొత్త అమృత్ భారత్ రైళ్లు
అమృత్ భారత్ 3.0 ప్రోటోటైప్ల కోసం ఎదురుచూస్తుండగా, ఇటీవలే తొమ్మిది కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇవి నార్త్ ఈస్ట్, నార్త్, వెస్ట్, సౌత్ ఇండియాలను కలుపుతూ సర్వీసులు నడుపుతున్నాయి. ఈ రైళ్లలో టికెట్ ధరలు చాలా అందుబాటులో ఉండేలా నిర్ణయించారు. సుమారు 1000 కి.మీ దూరం ప్రయాణానికి రూ.500 మాత్రమే ఖర్చవుతుంది.
| క్రమ సంఖ్య | మార్గం |
|---|---|
| 1 | గౌహతి (కామాఖ్య) – రోహ్తక్ |
| 2 | డిబ్రూగఢ్ – లక్నో (గోమతీ నగర్) |
| 3 | న్యూ జల్పైగురి – నాగర్కోయిల్ |
| 4 | న్యూ జల్పైగురి – తిరుచిరాపల్లి |
| 5 | అలీపుర్ ద్వార్ – ఎస్ఎంవీటీ బెంగళూరు |
| 6 | అలీపుర్ ద్వార్ – ముంబై (పన్వేల్) |
| 7 | కోల్‌కతా (శాంత్రాగచ్ఛి) – తాంబరం |
| 8 | కోల్‌కతా (హౌరా) – ఆనంద్ విహార్ (ఢిల్లీ) |
| 9 | కోల్‌కతా (సీల్దా) – బనారస్ |
ప్రారంభం ఎప్పుడంటే?
జనవరి 2026: తొమ్మిది కొత్త అమృత్ భారత్ రైళ్లు ప్రారంభం అయ్యాయి.
ఏప్రిల్ 2026: రెండు ప్రోటోటైప్ అమృత్ భారత్ 3.0 రైళ్లు ICF చెన్నైలో సిద్ధం కానున్నాయి.
డిసెంబర్ 2026 చివరి నాటికి: ట్రయల్స్ పూర్తి చేసుకొని ప్రోటోటైప్ రైళ్లు వాణిజ్య సర్వీసుల కోసం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఎల్హెచ్బీ రేక్ల స్థానంలో అమృత్ భారత్ 3.0
దీర్ఘదూరం ప్రయాణించే రైళ్లలో ప్రస్తుతం ఉన్న ఎల్హెచ్బీ (LHB) రేక్ల స్థానంలో అమృత్ భారత్ 3.0 రేక్లను ఉపయోగించాలని రైల్వే ప్రణాళిక రూపొందించింది. చెన్నై-ఢిల్లీ గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్, చెన్నై-హౌరా కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ వంటి ప్రముఖ రైళ్లలో ఈ మార్పు చేర్చే అవకాశం ఉంది. ICF మొత్తంగా 50 అమృత్ భారత్ రేక్ల తయారీకి ఆర్డర్ పొందింది. ఇప్పటికే 18 రేక్లు రోల్ అవుట్ అయ్యాయి. మిగిలిన రేక్ల తయారీ వేగంగా జరుగుతోంది.
ప్రయాణికులకు ఇవీ అదనపు సౌకర్యాలు
కొత్త అమృత్ భారత్ రైళ్లలో ఫోల్డబుల్ స్నాక్ టేబుల్స్, మొబైల్ హోల్డర్లు, బాటిల్ హోల్డర్లు వంటి చిన్న చిన్న సౌకర్యాలు కూడా ఉండనున్నాయి. రేడియం ఫ్లోర్ స్ట్రిప్స్, అగ్ని ప్రమాద నివారణ వ్యవస్థ, దివ్యాంగుల కోసం ప్రత్యేక సౌకర్యాలు కూడా ఈ రైళ్లలో ఉంటాయి. ఇప్పటికే ప్రారంభమైన కొత్త అమృత్ భారత్ రైళ్లలో ఆర్ఏసీ (రిజర్వేషన్ అగైనెస్ట్ క్యాన్సిలేషన్) సీట్లు ఉండబోవని, కనీస ఛార్జీల విధానం అమల్లోకి వచ్చిందని రైల్వే అధికారులు తెలిపారు.
టికెట్ ధరల విధానం సింపుల్‌గా..
కొత్త అమృత్ భారత్ రైళ్లలో టికెట్ ధరల విధానం చాలా సింపుల్‌గా ఉంటుంది. 200 కి.మీ. వరకు స్లీపర్ క్లాస్ బేస్ ఫేర్ రూ.149 మాత్రమే. సెకండ్ క్లాస్‌లో 50 కి.మీ.కు రూ.36. అదనపు ఛార్జీలు (రిజర్వేషన్, సూపర్‌ఫాస్ట్) వేరుగా వసూలు చేస్తారు. 1000 కి.మీ. ప్రయాణానికి సగటున రూ.500 మాత్రమే ఖర్చవుతుంది.
ప్రస్తుతం ICF చెన్నైలో అమృత్ భారత్ 3.0 రైళ్ల తయారీ చివరి దశకు చేరుకుంది. మరికొద్ది నెలల్లోనే ఈ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. దీనివల్ల రైల్వే ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన, వేగవంతమైన ప్రయాణం అందుబాటులోకి రానుంది.
Arattai


