Telangana news -“పనివాళ్లపై నమ్మకం.. ప్రాణం పోయింది! కూకట్‌పల్లిలో మహిళ దారుణ హత్య”
హైదరాబాద్‌లో మరో షాకింగ్ క్రైమ్ వెలుగులోకి వచ్చింది. కూకట్‌పల్లిలో ఇంట్లో పని చేసే వారినే నమ్మి పెట్టుకున్న ఓ మహిళ ప్రాణం కోల్పోయింది. డబ్బు కోసం పనివాళ్లే ఆమెను దారుణంగా హత్య చేశారు. అన్నం పెట్టిన చేతులకే కత్తి పట్టి చంపేశారన్న విషయం స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.
ఘటన వివరాలు
బుధవారం సాయంత్రం స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీలో రేణు అగర్వాల్ అనే మహిళ హత్యకు గురయ్యారు. ఆమె భర్త రాకేశ్ అగర్వాల్ సనత్ నగర్‌లో స్టీల్ షాప్ నడుపుతారు. ఈ హత్య వెనుక షాకింగ్ ప్లాన్ ఉంది.
రోషన్ అనే యువకుడు గత తొమ్మిది సంవత్సరాలుగా రేణు బంధువుల ఇంట్లో పని చేస్తూ వచ్చాడు. కొద్దిరోజుల క్రితం అతడే జార్ఖండ్‌కు చెందిన హర్ష్ అనే వాడిని రేణు ఇంట్లో వంట మనిషిగా కుదిర్చాడు. కేవలం 11 రోజులు మాత్రమే పనిచేసిన హర్ష్, రోషన్‌తో కలిసి డబ్బు కోసం కుట్ర పన్నాడు.
ఎలా జరిగింది?
బుధవారం ఉదయం రాకేశ్, వారి కుమారుడు శుభం ఇంటి నుంచి బయటకు వెళ్లగానే రేణు ఒంటరిగా ఉండిపోయారు. ఈ అవకాశాన్ని వాడుకుని రోషన్, హర్ష్ ఇంట్లోకి వెళ్లారు. డబ్బు, నగలు ఎక్కడ పెట్టారో చెప్పమని రేణును బెదిరించారు. ఆమె చెప్పకపోవడంతో కూరగాయల కత్తులతో గొంతు కోసి, కుక్కర్‌తో తలపై కొట్టి చంపేశారు.
తర్వాత లాకర్లను బద్దలు కొట్టి నగలు, డబ్బు తీసుకుని సూట్‌కేసులో వేసుకున్నారు. రక్తపు మరకలతో ఉన్న దుస్తులు అక్కడే వదిలేసి, స్నానం చేసి కొత్త దుస్తులు వేసుకున్నారు. ఆ తర్వాత ఇంటికి తాళం వేసి రాకేశ్ కుటుంబానికి చెందిన స్కూటీపై పారిపోయారు.
ఎలా బయటపడింది?
సాయంత్రం ఐదు గంటల సమయంలో రాకేశ్, కుమారుడు రేణును ఫోన్ చేసినా స్పందించలేదు. ఇంటికి వచ్చిన రాకేశ్ తలుపు తట్టినా తెరవలేదు. ప్లంబర్ సహాయంతో వెనుక తలుపు తెరవగా, హాల్లో కాళ్లు, చేతులు కట్టేసి రక్తపు మడుగులో పడి ఉన్న రేణు కనిపించారు.
పోలీసుల దర్యాప్తు
సీసీ కెమెరాల్లో నిందితులు ఖాళీ చేతులతో ఇంట్లోకి వెళ్లి, సూట్‌కేసుతో బయటకు వస్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. హత్య చేసిన తర్వాత వారిద్దరూ అదృశ్యమయ్యారు. ప్రస్తుతం పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి హర్ష్, రోషన్‌ల కోసం గాలిస్తున్నారు.
Arattai