నవంబర్ 26 ప్రతి భారతీయుడికి ఎంతో గర్వకారణమైన రోజు. 1949లో ఇదే రోజున రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది. రాజ్యాంగం దేశ పురోగతిని స్పష్టతతో, దృఢ నిశ్చయంతో నిరంతరం ముందుకు నడిపిస్తున్న పవిత్ర గ్రంథం. అందుకే, దాదాపు దశాబ్దం కిందట 2015లో ఎన్‌డీఏ ప్రభుత్వం నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా గుర్తించాలని నిర్ణయించింది.
మన రాజ్యాంగానికి ఉన్న ఈ శక్తే నాలాంటి ఒక సామాన్యమైన, ఆర్థికంగా వెనకబడిన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని 24 సంవత్సరాలకు పైగా ప్రభుత్వ అధినేతగా నిరంతరాయంగా సేవ చేయగలిగేలా చేసింది. 2014లో నేను మొదటిసారి పార్లమెంటుకు వచ్చినప్పుడు ఆ ప్రజాస్వామ్య దేవాలయం మెట్లను తాకి నమస్కరించిన క్షణాలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. మళ్ళీ, 2019 ఎన్నికల ఫలితాల తర్వాత నేను సెంట్రల్ హాల్‌లోకి ప్రవేశించినప్పుడూ… శిరస్సు వంచి గౌరవ చిహ్నంగా నా నుదిటితో రాజ్యాంగాన్ని తాకి నమస్కరించాను. ఈ రాజ్యాంగం నాలాంటి అనేక మందికి కలలు కనే శక్తినీ, వాటి కోసం పనిచేసే శక్తినీ ఇచ్చింది.
రాజ్యాంగ దినోత్సవం రోజున మనం… రాజ్యాంగ రూపకల్పనకు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన కృషి చేసిన రాజ్యాంగ సభలోని స్ఫూర్తిదాయక సభ్యులందరి సేవలను స్మరించుకుంటాం. అద్భుతమైన దూరదృష్టితో ముసాయిదా కమిటీకి అధ్యక్షత వహించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కృషినీ మనం గుర్తు చేసుకుంటాం. రాజ్యాంగ సభలోని అనేక మంది విశిష్ట మహిళా సభ్యులు తమ ప్రభావవంతమైన ఆలోచనలు, దార్శనిక దృక్పథాలతో రాజ్యాంగాన్ని సుసంపన్నం చేశారు.
నా మనస్సు 2010 సంవత్సరం వైపు మళ్లింది. భారత రాజ్యాంగం 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అపురూప సందర్భం అది. విచారమేమంటే, ఆ సందర్భానికి జాతీయ స్థాయిలో తగిన ప్రాధాన్యం లభించలేదు. కానీ, రాజ్యాంగం పట్ల మా సమష్టి కృతజ్ఞతను, నిబద్ధతను వ్యక్తపరచడానికి మేం గుజరాత్‌లో ‘సంవిధాన్ గౌరవ్ యాత్ర’ను నిర్వహించాం. మన రాజ్యాంగాన్ని ఏనుగుపై ఉంచి ఊరేగించాం. నేను, వివిధ రంగాలకు చెందిన అనేక మంది ప్రముఖులు కలిసి ఆ ఊరేగింపులో పాల్గొనే గౌరవాన్ని పొందాం.
రాజ్యాంగం 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భం భారత ప్రజలకు అసాధారణ మైలురాయిగా నిలవాలని మేం నిర్ణయించుకున్నాం. ఈ చరిత్రాత్మక సందర్భాన్ని స్మరించుకునేందుకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించే భాగ్యం… దేశవ్యాప్తంగా కార్యక్రమాలను ప్రారంభించే అదృష్టం మాకు లభించింది. ఈ కార్యక్రమాల్లో రికార్డు స్థాయిలో ప్రజల భాగస్వామ్యం కనిపించింది.
ఈ సంవత్సరం రాజ్యాంగ దినోత్సవం పలు కారణాల వల్ల మరింత ప్రత్యేకమైంది. ఇది ఇద్దరు అసాధారణ వ్యక్తులైన సర్దార్ వల్లభాయ్ పటేల్, భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి సంవత్సరం. వారిద్దరూ మన దేశం కోసం అమూల్యమైన కృషి చేశారు. సర్దార్ పటేల్ దార్శనిక నాయకత్వం భారత రాజకీయ ఏకీకరణకు భరోసానిచ్చింది. ఆర్టికల్ 370, 35(A) లకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడానికి ఆయన ప్రేరణ, ధైర్యసాహసాలే మా చర్యలకు మార్గనిర్దేశం చేశాయి. భారత రాజ్యాంగం ఇప్పుడు జమ్మూ కాశ్మీర్‌లో సంపూర్ణంగా అమలులో ఉంది. ప్రజలకు, ముఖ్యంగా మహిళలు, అణగారిన వర్గాలకు అన్ని రాజ్యాంగ హక్కులనూ నిర్ధరిస్తుంది. భగవాన్ బిర్సా ముండా జీవితం మన గిరిజన వర్గాలకు న్యాయం, గౌరవం, సాధికారతను అందించాలనే భారత సంకల్పానికి స్ఫూర్తినిస్తూనే ఉంది.
తరతరాలుగా భారతీయుల సమష్టి సంకల్పాన్ని ప్రతిధ్వనించే పదాలతో కూడిన వందేమాతరం గేయం 150వ వార్షికోత్సవాన్నీ ఈ సంవత్సరమే మనం జరుపుకుంటున్నాం. ఈ సమయంలోనే శ్రీ గురు తేగ్ బహదూర్ గారి 350వ వర్ధంతి సందర్భంగా మనం ఆ మహనీయుని త్యాగాన్ని స్మరించుకుంటున్నాం. ఆయన జీవితం, త్యాగం… మనల్ని ధైర్యం, కరుణ, శక్తితో ప్రకాశింపజేస్తూనే ఉన్నాయి.
ఈ వ్యక్తులు, వారి విజయాలు మన విధులకు ఉన్న ప్రాధాన్యతను తెలియజేస్తున్నాయి. రాజ్యాంగం కూడా ఆర్టికల్ 51ఏ ద్వారా ప్రాథమిక విధుల గురించి ప్రధానంగా చెబుతోంది. సామాజిక, ఆర్థిక పురోగతిని మనం సమష్టిగా ఎలా సాధించాలో ఈ విధులు మార్గనిర్దేశం చేస్తున్నాయి. మహాత్మా గాంధీ ఎల్లప్పుడూ ఒక పౌరుడికి ఉండే విధులకు ప్రాధాన్యత ఇచ్చేవారు. విధిని సక్రమంగా నిర్వర్తించటం ద్వారా అది దానికి సంబంధించిన ఒక హక్కును సృష్టిస్తుందని.. నిజమైన హక్కులు విధులను నిర్వర్తించిన ఫలితమేనని ఆయన విశ్వసించారు.
ఈ శతాబ్దం ప్రారంభమై ఇప్పటికే 25 సంవత్సరాలు గడిచాయి. ఇప్పటి నుంచి కేవలం రెండు దశాబ్దాలకు పైబడిన కాలంలోనే వలస పాలన నుంచి విముక్తి పొంది 100 సంవత్సరాలు పూర్తవుతాయి. 2049 సంవత్సరానికి రాజ్యాంగాన్ని స్వీకరించి వంద సంవత్సరాలు అవుతాయి. ఈ రోజు మనం రూపొందించే విధానాలు, తీసుకునే నిర్ణయాలు, మన సామూహిక చర్యలు రాబోయే తరాలతరాల జీవితాలను తీర్చిదిద్దుతాయి.
దీని నుంచి ప్రేరణ పొంది మనం వికసిత్ భారత్ కలను సాకారం చేసుకునే దిశగా ముందుకు సాగుతున్నప్పుడు మన దేశం పట్ల మనకున్న విధులను అన్నివేళలా మన మనసులలో అగ్రస్థానంలో ఉంచుకోవాలి.
మన దేశం మనకు ఎంతో ఇచ్చింది. ఈ భావమే హృదయాంతరాల నుంచి లోతైన కృతజ్ఞతా భావాన్ని తెలియజేస్తుంది. ఈ భావనతో మనం జీవించినప్పుడు.. మన విధులను నెరవేర్చడం మన స్వభావంలో అంతర్భాగం అవుతుంది. మన విధులను నిర్వహించేందుకు ప్రతి పనిలో మనం పూర్తి సామర్థ్యం, అంకితభావాన్ని పెట్టటం తప్పనిసరి అవుతుంది. మన ప్రతి చర్య రాజ్యాంగాన్ని బలోపేతం చేయాలి. జాతీయ లక్ష్యాలు, ప్రయోజనాలను ముందుకు తీసుకువెళ్లాలి. అన్నింటికీ మించి మన రాజ్యాంగ నిర్మాతల కలలను నెరవేర్చడం మన బాధ్యత. మనం ఈ భావనతో పనిచేసినప్పుడు మన దేశ సామాజిక, ఆర్థిక పురోగతి అనేక రెట్లు పెరుగుతుంది.
మన రాజ్యాంగం మనకు ఓటు హక్కును ఇచ్చింది. మనం నమోదు చేసుకున్న జాతీయ, రాష్ట్ర, స్థానిక ఎన్నికలలో ఓటు వేసే అవకాశాన్ని వదలుకోకపోవడం అనేది మన విధి. ఇతరులను ప్రేరేపించేందుకు మనం ప్రతి నవంబర్ 26న పాఠశాలలు, కళాశాలల్లో 18 ఏళ్లు నిండేవారిని ఉద్దేశించి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించడం గురించి ఆలోచించవచ్చు. ఈ విధంగా మొదటిసారి ఓటర్లుగా ఉండే విద్యార్థులు తాము దేశ నిర్మాణ ప్రక్రియలో చురుకైన భాగస్వాములుగా కూడా ఉన్నట్లు భావిస్తారు.
మనం మన యువతకు బాధ్యత, గర్వంతో కూడిన స్ఫూర్తితో ప్రేరణ కలిగించినప్పుడు వారు తమ జీవితాంతం ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉంటారు. ఈ నిబద్ధతా భావమే ఒక బలమైన దేశానికి పునాది.
ఈ రాజ్యాంగ దినోత్సవం నాడు ఈ గొప్ప దేశంలోని పౌరులుగా మన విధులను నెరవేరుస్తామన్న మన ప్రతిజ్ఞను పునరుద్ఘాటించుకుందాం. ఇలా చేయడం ద్వారా మనం అభివృద్ధి చెందిన, సాధికారత కలిగిన భారత్ నిర్మాణానికి అర్థవంతమైన సహకారం అందించగలం.
మీ,
నరేంద్ర మోదీ
Arattai