జనసేన ఎంపీ పేరుతో వాట్సాప్ మోసం… ఒక్కసారిగా రూ.92 లక్షలు గాలిలో కలిసిపోయాయి!
కాకినాడ జనసేన ఎంపీ, టీ-టైమ్ సంస్థ అధినేత ఉదయ్ శ్రీనివాస్ పేరుతో సైబర్ నేరగాళ్లు షాకింగ్ మోసానికి పాల్పడ్డారు. ఎంపీ ఫొటోను వాట్సాప్ ప్రొఫైల్ పిక్‌గా పెట్టి ఆయన కంపెనీ నుంచి ఏకంగా రూ.92 లక్షలు కొల్లగొట్టారు. ఈ ఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది.
ఇలా వల వేసారు…
గత నెల 22న టీ-టైమ్ కంపెనీ చీఫ్ ఫైనాన్స్ మేనేజర్ గంగిశెట్టి శ్రీనివాసరావుకు ఓ కొత్త నంబర్ నుంచి వాట్సాప్ మెసేజ్ వచ్చింది. ప్రొఫైల్ పిక్‌లో ఎంపీ ఫొటో ఉండటంతో, అది నిజంగా ఉదయ్ శ్రీనివాసేనని నమ్మాడు.

“నేను కొత్త నంబర్ వాడుతున్నాను, అత్యవసరం… వెంటనే కొంత డబ్బు పంపు” అంటూ వరుస మెసేజ్‌లు పంపాడు ఆ నంబర్. ఇది నిజంగానే యజమాని డిమాండ్ అనుకుని, ఎలాంటి చెక్ చేయకుండా మేనేజర్ 11 సార్లుగా రూ.92 లక్షలు వివిధ బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశాడు.
నిజం బయటపడటానికి రెండు వారాలు!
ఈ నెల 8న ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ తన ఖాతాలను పరిశీలిస్తుండగా అనుమానాస్పద లావాదేవీలు కనిపించాయి. వెంటనే ఫైనాన్స్ మేనేజర్‌ను ప్రశ్నించగా, తన నంబర్ మారలేదని, డబ్బుల కోసం ఎప్పుడూ మెసేజ్ చేయలేదని స్పష్టంచేశారు. అప్పుడు మేనేజర్ తాము మోసపోయామని గ్రహించి సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పోలీసులు రంగంలోకి
ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే చర్యలు ప్రారంభించారు. కానీ మొదటి లావాదేవీ జరిగి రెండు వారాలు దాటిపోవడంతో, ఎక్కువ మొత్తాన్ని నేరగాళ్లు విత్‌డ్రా చేసేశారు. పోలీసులు కేవలం రూ.7 లక్షలు మాత్రమే స్తంభింపజేయగలిగారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ప్రజలకు హెచ్చరిక
సాంకేతిక యుగంలో ఫిషింగ్, ఓటీపీ మోసాలు, లాటరీ స్కామ్‌లు, ఉద్యోగాల పేరుతో మోసాలు పెరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. అనుమానాస్పద నంబర్ల నుంచి వచ్చే మెసేజ్‌లను నమ్మొద్దు, డబ్బు బదిలీ చేసే ముందు తప్పనిసరిగా ధృవీకరించుకోవాలని సూచిస్తున్నారు.
Arattai