గిరిజన మహిళలకు ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan నూతన సంవత్సర కానుక
• సికిల్ సెల్ ఎనేమియా బాధితుల కోసం అరకులో బ్లడ్ బ్యాంకు
• ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో… దాతల సహకారంతో ప్రభుత్వ ఆసుపత్రికి అనుబంధంగా బ్లడ్ బ్యాంక్ భవనం నిర్మాణం
• కురిడీ మాటా మంతిలో సమస్యను ఉపముఖ్యమంత్రి కు వివరించిన గిరిజన మహిళ
• వైద్య నిపుణుల సూచనలతో బ్లడ్ బ్యాంకు ఏర్పాటుకు సన్నద్ధం
గిరిజన మహిళల్లో గర్భస్రావాలు, రక్తహీనత తదితర రుగ్మతలకు కారణమవుతున్న సికిల్ సెల్ ఎనేమియా నుంచి రక్షణ కల్పించేందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో అరకు నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో బ్లడ్ బ్యాంక్ భవనం ఏర్పాటు కానుంది.
గిరిజన మహిళలకు నూతన సంవత్సర కానుకగా నిర్మించనున్న ఈ బ్లడ్ బ్యాంకు భవనంలో అవసరాలకి అనుగుణంగా రక్తం నిల్వ చేసుకునేందుకు వీలుగా అత్యాధునిక సౌకర్యాలు కల్పించనున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో.. దాతల సహకారంతో నిర్మించనున్న ఈ భవనాన్ని నిర్మాణం అనంతరం అరకు ప్రభుత్వ ఆసుపత్రికి అనుసంధానిస్తారు.
అడవితల్లి బాట కార్యక్రమం ప్రారంభోత్సవానికి వెళ్లిన సందర్భంలో కురిడీ గ్రామంలో నిర్వహించిన మాటా మంతి కార్యక్రమంలో ఓ మహిళ సికిల్ సెల్ ఎనేమియా కారణంగా గిరిజన మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువచ్చారు. జన్యుపరంగా వచ్చే ఈ రుగ్మత గర్భిణుల ఉసురు తీస్తోందని వివరించారు. ఈ సమస్యకు పరిష్కారం చూపుతానని ఆనాడు మాటిచ్చారు. గిరిజనుల సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు… సికిల్ సెల్ ఎనేమియా నివారణ ఎలా? అనే అంశంపై వైద్య నిపుణులతో పలు సందర్భాల్లో చర్చించారు. వారసత్వంగా వచ్చే ఈ వ్యాధి తీవ్రత రక్తమార్పిడి ద్వారా తగ్గించే అవకాశం ఉందన్న వారి సూచన మేరకు – నూతన సంవత్సర కానుకగా బ్లడ్ బ్యాంకు భవన నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా ఉన్న సుమారు 1,500 మంది సికిల్ సెల్ ఎనేమియా బాధితులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం ఉపశమనాన్ని ఇవ్వనుంది.
Arattai