*ఎస్ సీ, ఎస్ టి గృహాల సోలరైజేషన్ కు ఏపీఈపీడీసీఎల్ ఒప్పందం*
ఎస్ సీ, ఎస్ టి గృహాలపై రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్ల ఏర్పాటు కోసం ఏపీఈపీడీసీఎల్ సంస్థ సద్భవ్ ఫ్యూచర్ టెక్ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కార్యక్రమం సోమవారం ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో జరిగింది. సంస్థ సీఎండి ఇమ్మడి పృథ్వీతేజ్, డైరెక్టర్ (ఆపరేషన్స్) టి.వి. సూర్యప్రకాశ్ సమక్షంలో సీజీఎం ఎల్. దైవప్రసాద్, సద్భవ్ ఫ్యూచర్ టెక్ లిమిటెడ్ డైరెక్టర్ భూపేంద్ర సింగ్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
ఈ ఒప్పందం కింద నర్సీపట్నం, పాలకొండ, పెద్దాపురం, రామచంద్రపురం, టెక్కలి, విజయనగరం రూరల్, తాడేపల్లిగూడెం డివిజన్లలోని 44,998 ఎస్ సీ – ఎస్ టి సర్వీసులకు మొత్తం 90 మెగావాట్ల సామర్థ్యంతో రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ పనులను వచ్చే 6 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది.
*పీఎం సూర్యఘర్ పథకం కింద ఉచితంగా సోలార్*
పీఎం సూర్యఘర్ పథకంలో భాగంగా ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని సుమారు 2 లక్షల ఎస్ సీ, ఎస్ టి గృహాలపై ఉచితంగా సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి టెండర్ ప్రక్రియ ఇప్పటికే పూర్తి అయ్యింది. ఈ పథకం కింద ప్రతి ఎస్ సీ/ఎస్ టి గృహ వినియోగదారుని ఇంటిమీద 200 చదరపు అడుగుల ప్రాంతంలో, 2 కిలోవాట్ల సామర్థ్యంతో రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయబడతాయి.
Arattai