Amaravati: అమరావతి చట్టబద్ధతకు లైన్ క్లియర్.. మోదీ సర్కార్ కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశానికి సంబంధించి కీలక మలుపు తిరిగింది.
అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు కేంద్ర హోంశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఇప్పటివరకు కొనసాగిన అనిశ్చితికి ముగింపు దిశగా అడుగులు పడుతున్నాయి.
కేంద్ర హోంశాఖ ఇప్పటికే ఈ ఫైల్‌కు ఆమోద ముద్ర వేసింది.
ఇక న్యాయశాఖ, పట్టణాభివృద్ధి శాఖలతో పాటు మరో రెండు కేంద్ర శాఖల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత
ఈ బిల్లును కేంద్ర కేబినెట్ ముందుకు తీసుకెళ్లే ప్రక్రియ ప్రారంభం కానుంది.
కేబినెట్ ఆమోదం లభిస్తే,
అమరావతి రాజధాని బిల్లును పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు
మోదీ సర్కార్ సిద్ధమవుతున్నట్లు సమాచారం.
విభజన చట్టం ప్రకారం
రాష్ట్రానికి రాజధాని ఏ ప్రాంతంలో ఉండాలన్నది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాధికార పరిధిలోనే ఉంటుంది.
ఈ నిబంధనకు అనుగుణంగానే అప్పట్లో అమరావతిని ఎంపిక చేశారు.
రాష్ట్ర విభజన తర్వాత
2014లో అమరావతిలో భూమి పూజ, శంకుస్థాపన కార్యక్రమాలు కూడా జరిగాయి.
అయితే పాలనా మార్పులతో రాజధాని నిర్మాణం జాప్యానికి గురైంది.
తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం
మూడు రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది.
దీంతో అమరావతి భవిష్యత్తుపై తీవ్ర గందరగోళం ఏర్పడింది.
రాజధాని మార్పులపై సాగిన రాజకీయ, న్యాయ పోరాటాలు
రైతులు, భూస్వాముల్లో అస్థిరతను పెంచాయి.
అమరావతి ప్రాంతంలో అభివృద్ధి నిలిచిపోయిన పరిస్థితి నెలకొంది.
తాజాగా టీడీపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో
మళ్లీ అమరావతినే ఏపీ రాజధానిగా ప్రకటిస్తూ ముందుకు వెళ్లింది.
ఈసారి మాత్రం శాశ్వత పరిష్కారం కావాలన్న ఉద్దేశంతో
పార్లమెంట్ చట్టబద్ధత కోసం కేంద్రాన్ని కోరింది.
ఇటీవల జరిగిన అఖిలపక్ష సమావేశంలో కూడా
అమరావతికి చట్టబద్ధత కల్పించాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
రాజధాని అంశం రాజకీయ మార్పులకు అతీతంగా ఉండాలన్నది ప్రధాన వాదన.
విభజన చట్టం ప్రకారం
పది సంవత్సరాల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగింది.
ఆ గడువు ముగియడంతో ఏపీకి ప్రత్యేక శాశ్వత రాజధాని ప్రకటించాల్సిన అవసరం ఏర్పడింది.
ఈ నేపథ్యంలో
ఏ తేదీ నుంచి అమరావతిని రాజధానిగా పరిగణించాలన్న విషయంపై
కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని స్పష్టత కోరింది.
హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గడువు ముగిసిన తేదీ నుంచే
అమరావతిని రాజధానిగా ప్రకటించాలని
రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సూచించింది.
దీంతో విభజన చట్టానికి నోడల్ ఏజెన్సీగా ఉన్న కేంద్ర హోంశాఖ
అమరావతిని అధికారిక రాజధానిగా ప్రకటించే దిశగా
సంబంధిత శాఖల అభిప్రాయాలను సేకరించింది.
గతంలో మూడు రాజధానుల ప్రతిపాదన వల్ల
అమరావతి విషయంలో చట్టపరమైన గందరగోళం నెలకొంది.
భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే
పార్లమెంట్ చట్టమే సరైన మార్గమని కూటమి ప్రభుత్వం భావిస్తోంది.
ఈ బిల్లు ఆమోదం పొందితే
ఆంధ్రప్రదేశ్ రాజధాని వివాదానికి శాశ్వత పరిష్కారం లభించినట్లవుతుంది.
అమరావతి అభివృద్ధికి చట్టపరమైన బలమైన పునాది ఏర్పడుతుంది.
ఎన్డీయే ప్రభుత్వానికి ఉభయ సభల్లో సంఖ్యాబలం ఉండటంతో
బిల్లు ఆమోదం లాంఛనమేనన్న అభిప్రాయం వినిపిస్తోంది.
అయితే రాజకీయంగా మరో అంశం ఆసక్తికరంగా మారింది.
పార్లమెంటులో ఈ బిల్లు చర్చకు వచ్చినప్పుడు
వైసీపీ ఏ వైఖరి అవలంబిస్తుంది?
మద్దతు ఇస్తుందా లేక వ్యతిరేకిస్తుందా అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
అమరావతి బిల్లుపై జరిగే చర్చలు
రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు,
జాతీయ స్థాయిలో కూడా కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.




Arattai